తాడ్వాయి మండలంలోని మారుమూల పల్లె కాటాపూర్. ఇక్కడ పుట్టి పెరిగిన ఓ యువకుడు.. అమెరికా గడ్డపై సత్తా చాటాడు. వరంగల్ నుంచి వర్జీనియా వెళ్లి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇదంతా మొన్నటి ముచ్చట.. నాణానికి ఒకవైపే. ఆ వ్యాపారవేత్తే.. కొవిడ్ కాలంలో కొందరికి కొడుకయ్యాడు.. మరికొందరికి ఆపద్బాంధవుడయ్యాడు. విదేశాల్లో చిక్కుకున్న 250 మంది భారతీయులను మాతృదేశానికి తీసుకొచ్చి.. ఆయా కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు..రవి పులి.
కొవిడ్-19.. చిన్న, పెద్ద.. పేద, ధనిక తేడా లేకుండా అందరి బతుకు చిత్రాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇక్కడి పరిస్థితే చూద్దాం. వలస కూలీలు కాళ్లు బొబ్బలు ఎక్కేలా నడిచి, వారివారి స్వస్థలాలకు చేరిన కథనాలు ఎన్నో చదివాం. ఇలాంటి సంఘటనలకు చలించిన సినీ నటుడు సోనూసూద్ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి, కూలీలను గమ్యస్థానాలకు చేర్చాడు. అంతేకాదు.. 173మంది వలస కార్మికులను ముంబై నుంచి డెహ్రాడూన్ వరకూ ఫ్లయిట్‌లో పంపించాడు. సినిమాల్లో విలన్ కాస్తా.. నిజజీవితంలో హీరో అయ్యాడు. దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాబట్టి పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. సెలెబ్రిటీ హోదా ఉండటంతో.. ఎలాంటి ఇబ్బందులూ పడలేదు. అదే, ఒక మామూలు వ్యక్తికి ఇది సాధ్యమవుతుందా..? ఈ ప్రశ్నకు సమాధానమే.. వరంగల్ బిడ్డ రవి పులి
కొవిడ్ కోరల్లోంచి..
కొవిడ్-19 కారణంగా మూడు నెలల నుంచీ రాష్ట్రం దాటాలంటేనే వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తున్నది. అలాంటిది విదేశాల నుంచి ఇక్కడికి రావాలనుకునేవారి పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులకు దూరమైన వాళ్లు.. గర్భిణులు, వివిధ కారణాలతో అంతదూరం వచ్చిన వాళ్లు, వీసా గడువు తీరినవాళ్లు.. జాబితా తయారు చేస్తే అమెరికాలో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాలవారూ అనేక మంది. అలాంటి వారినంతా కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్’ పేరుతో ఎయిరిండియా విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తున్నది. దీనికోసం సుమారు 30వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, లాటరీ ద్వారా పేరు వచ్చినవారికి మాత్రమే ఆ అవకాశం. ఆ అదృష్టం దక్కకపోతే? అత్యవసరం అయినా సరే, అయినవాళ్లను చేరుకోలేరు. అలాంటి వారికంతా ఆశాకిరణంలా కనిపించారు రవి. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి నలభై మందికి పైగా భారతదేశానికి పంపించారు.
అమ్మే కారణం..
కరోనా మొదలయిన రోజులు. రవి తల్లి బుచ్చమ్మ కాటాపూర్ గ్రామంలో ఉంటారు. ఎక్కడో వాషింగ్టన్‌లో ఉన్న తన కొడుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. వెంటనే బిడ్డకు ఫోన్‌చేసి, ఇండియా తిరిగి వచ్చేయమని కోరారు. అదే సమయంలో, లాక్‌డౌన్ వల్ల విమానాలు రద్దయ్యాయి. ఆ రోజు తన తల్లి అనుభవించిన బాధ.. ఆయనను కదిలించింది. తన తల్లిలా తల్లడిల్లే ఎంతోమంది అమ్మల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పం బలపడింది.
మనోబలం ముందు..
ప్రభుత్వాలే, ఆ వ్యయప్రయాసలు భరించడానికి ఇబ్బంది పడుతున్నాయి. అలాంటిది రవిలాంటి ఒక ఎన్‌ఆర్‌ఐకి, ఇదంతా సాధ్యమేనా..? అని చుట్టూ ఉన్నవాళ్లంతా సందేహించారు. వాళ్లు అలా అన్నందుకైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే సంకల్పమే అతడిని ముందుకు నడిపించింది. అప్పటిదాకా విమానాలు ఎక్కిన అనుభవమే కానీ, ఆ తరహా వ్యవహారాల మీద వీసమెత్తు అవగాహన కూడా లేదు. అయినాసరే, తనే ఓ సైన్యమై కదిలారు. ఆశావహుల కోసం యూఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్ (యూఎస్‌ఐఎస్‌ఎమ్) అనే వేదికను ఏర్పాటు చేశారు. అందర్నీ వివరాలు పంపించమని కోరారు. అక్కడి తెలుగు సంఘాలే కాదు, తమిళ, కన్నడ, మరాఠీ ప్రజలతోపాటు ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌తోనూ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎంబసీకి కూడా ప్రయాణికుల వివరాలు పంపించారు. మొత్తానికి తొలి జాబితా తయారైంది. ఆ తర్వాత తన పరిచయాలతో అమెరికా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడారు. విదేశీ వ్యవహారాలు, విమానయాన శాఖ, న్యాయశాఖ.. ఇలా అనేక వైపుల నుంచీ చిక్కుముళ్లే. ఓపికగా వాటన్నిటినీ అధిగమించారు. మొత్తానికి ఇరవైఒక్క రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కింది.
రాజీ పడకుండా..
కరోనా నిబంధనల్లో భౌతిక దూరం ముఖ్యమైనది. విమానాల్లోనూ ఆ నియమాన్ని పాటించాలంటే చాలా ఖర్చు అవుతుంది. రవి ఆ వ్యయాలకూ సిద్ధపడ్డారు. ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం జూన్ 24న చికాగో, న్యూయార్క్, డల్లాస్ ప్రాంతాల్లో 250 మంది భారతీయులను ఎక్కించుకొని ఇండియాకు బయల్దేరింది. 26న తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. సొంతగడ్డ మీద కాలుపెడుతుంటే. అందరి లోనూ ఆనందం. ఇదీ అని చెప్పలేని ఉద్వేగం. రవి పులి పట్ల ఉప్పొంగిన వాత్సల్యం. ‘ఇక్కడ డబ్బులు, ఇతర విషయాలను పక్కన పెడితే, మన వాళ్లను సురక్షితంగా ఇంటికి చేర్చాననే సంతోషం వెలకట్టలేనిది’ అంటున్నారు రవి.
అందరి సహకారం
మా అమ్మ వల్లే నేను ఈ పనికి పూనుకున్నా. అందరూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నిస్తారు? కానీ, మన వల్ల ఏం సాధ్యమవుతుంది? అని ఒక్కరుకూడా ఆలోచించరు. ముందు నేను ఈ పనికి పూనుకున్నప్పుడు చాలామంది వారించారు, వద్దన్నారు. కానీ, దగ్గరి మిత్రులు, సీనియర్ అధికారులు నా మీద నమ్మకం పెట్టారు. అలాగే నా భార్య మమత నా ప్రయత్నానికి వెన్నెముకై నిలిచి, ఈ పనిలో భాగస్వామిగా నిలిచింది. పిల్లలు రితిక్, రిషిక్ చిన్నవాళ్లే అయినా.. ఈ మహాయజ్ఞంలో వారి భాగస్వామ్యం మరింత బలాన్నిచ్చింది. ఇప్పటికీ వందే భారత్ ఫేజ్-4 నడిపిస్తున్నది. కానీ, ఇంకా చాలామంది ఇక్కడ చిక్కుకుపోయారు. తమకోసం కూడా మరికొన్ని ఫ్లయిట్స్ వేయమని అడుగుతున్నారు. కొంతకాలం వేచి చూసి మరొక విమానం వేద్దామని అనుకుంటున్నాం. వైద్యంతో పాటు, ఇతర సేవలనూ అందించాలనుకుంటున్నా. సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించాలని అనుకుంటున్నా.
విదేశాల్లో మనవాళ్లు..
వరంగల్‌కు చెందిన ఒక అబ్బాయికి వీసా స్టాంపింగ్ అయిపోయింది. యూఎస్ వచ్చాడు. అయితే, ఇక్కడికి వచ్చాక కొన్ని డాక్యుమెంట్లు లేవని అతడిని తిరిగి ఇండియాకు పంపించాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ సమయంలో అతడిని అమెరికాలోకి అనుమతించలేరు. వెనక్కి పంపించనూలేరు. దీంతో ఆ అబ్బాయిని డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఇంచుమించు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఈ విషయం రవి దృష్టికి వచ్చింది. అతడిని ఎలాగైనా ఇండియా పంపించాలని అనుకున్నాడు. అదే సమయంలో తనకు తెలిసిన ఒక విద్యార్థిని కూడా తాను ఇండియా వెళ్లేందుకు పడిన కష్టాలను ఆయన ముందు ఏకరువు పెట్టుకుంది. ఇలాంటి ఎన్నో కథనాలు రవిని కదిలించాయి. ప్రభుత్వం కొంత వరకు చేస్తూనే ఉంది. కానీ, ఆ సదుపాయం అందరికీ అందడం లేదని అర్థమయింది. ఈ విషయంలో తాను ఏం చేయగలనా అని ఆలోచించాడు.
ఇంటర్నెట్ లేని పల్లె..
మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామం. పదమూడు మంది సంతానంలో నేను పదోవాడిని. మా నాన్న తాళ్లెక్కేది. వ్యవసాయం చేసేది. నేను కూడా అలాగే ఉండాలనుకున్నారు. కానీ, నేను మాత్రం చదువుకుంటానని పట్టుబట్టాను. అలా నేను మా ఇంట్లో మొదటి గ్రాడ్యుయేట్‌ని అయ్యాను. చదువుకోసం కిలోమీటర్ల దూరం నడిచిన దశ నుంచి, అమెరికాలో సొంతంగా కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాను. ఇప్పటికీ మా ఊరికి సరైన బస్సు సౌకర్యం లేదు. ఇంటర్నెట్ కూడా రాదు. నాతో ఎవరైనా ‘కాదు’ అని అంటే, అది ఎలా కాదో చూడాలి అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ నా తత్వం అంతే. ఇదే కాదు, 23 సంవత్సరాలుగా .. నాకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడే పనులు చాలానే చేస్తున్నాను.
Congratulation!