‘అమ్మాయిని అంత దూరం పంపించి చదివించడం అవసరమా? ఆ డబ్బుతో ఘనంగా పెళ్లిచేయొచ్చు!’ అన్నారు తెలిసినవాళ్లు, బంధువులు. కానీ న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆ అమ్మాయికి ఉన్న ఇష్టం అమ్మానాన్నలూ ప్రోత్సహించేలా చేసింది. ఫలితమే.. ప్రపంచవ్యాప్తంగా ఏడులక్షలమంది పోటీపడ్డ ఎరాస్మస్ మండస్ సెరెనా ఉపకారవేతనాన్ని మనదేశం నుంచి అందుకున్న ఏకైక విద్యార్థిగా ప్రశంసలు అందుకుంటోంది చలమల్ల ఇక్షిత.
చిన్నతనం నుంచీ నాకు అణు పరిజ్ఞానం అంటే చాలా ఇష్టం. అబ్దుల్ కలాం కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ చదివే అంతటి గొప్పవ్యక్తి అయ్యారని చిన్నతనంలో అనుకొనేదాన్ని. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న వెంకటేశ్వర్లు.. ఉస్మానియా యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. అమ్మ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రిసెర్చ్ సెంటర్‌లో రిసెర్చ్ అసిస్టెంట్. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్‌లో చదివేటప్పుడే నాకు సైన్స్‌పై ఇష్టం పెరిగింది. అందుకే ఇంటర్ తర్వాత.. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేశా. ‘ఆడపిల్లని అంత దూరం పంపించడం అవసరమా? ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఖర్చు కదా అన్నారు’ తెలిసినవాళ్లు, బంధువులు. కానీ నా ప్రణాళిక నాకుంది. విదేశాల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ చదవాలన్నా, ఇలాంటి ఉపకారవేతనాలు అందుకోవాలన్నా… అణు పరిజ్ఞానానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. అందుకే ఇందులో చేరి రెండో సంవత్సరం నుంచే ఆటమ్స్ ఫర్ పీస్ క్లబ్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేశా. చాలామందికి న్యూక్లియర్ ఎనర్జీపైన అపోహలున్నాయి. అది వినాశనానికి దారి తీస్తుందనుకుంటారు. కానీ సంప్రదాయ ఇంధన వనరులు అయిపోతే అణుశక్తినే మనం నమ్ముకోవాలి. దీంతో వైద్యరంగంలోనూ ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. వీటిపై స్కూల్ పిల్లలకి అవగాహన కలిగిస్తూ ఉండేదాన్ని. గత డిసెంబర్‌లో ఎరాస్మస్ మండస్ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకున్నా. ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది న్యూక్లియర్ విభాగంలో పోటీపడ్డారు. ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ అయ్యింది. క్లబ్ ప్రెసిడెంట్‌గా నా అనుభవం ఉపయోగపడింది. అలా ఐరోపాలో న్యూక్లియర్ సైన్స్‌లో పీజీ చేయడానికి రూ.50లక్షల ఉపకారవేతనం అందింది. ఫ్రాన్స్, ఫిన్లాండ్, స్పెయిన్, ఇటలీ, స్లొవేనియా… దేశాల్లో ఒక్కో సెమిస్టర్ చదువుకొనే అవకాశమూ ఉంది. నచ్చిన అంశంపై ప్రణాళిక ప్రకారం చదవడంవల్లనే ఈ ఉపకారవేతనం అందుకొన్నా. ఈ మొత్తం ప్రణాళికని బీటెక్‌లో చేరడానికంటే ముందే అమ్మానాన్నలకు చెప్పా. దాంతో వాళ్లు కూడా మరోమాట అనకుండా ఓకే చెప్పారు. ఎవరేమన్నా ‘మా అమ్మాయికి మేమిచ్చే ఆస్తి డిగ్రీలే’ అనేవారు. వాళ్లిచ్చిన ధైర్యంతోనే ఈ విజయాన్ని సాధించా. – Eenadu Vasundara 2/9/22
Congratulation!