not found

కంబాలపాడు ఈడిగ మాదన్న

కె.ఈ.మాదన్న గా ప్రసిద్ధి చెందిన కంబాలపాడు ఈడిగ మాదన్న (మే 28, 1902 – మే 5, 1994), సామాజిక కార్యకర్త మరియు రాజకీయనాయకుడు. కర్నూలు జిల్లాలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు మరియు అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి, వెనుకబడిన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం మరియు సామాజిక మార్పుకై స్వాతంత్రానికి ముందు, తర్వాత కృషిచేసిన నాయకుడు.

కుటుంబం
కె.ఈ మాదన్న, 1902 మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు గ్రామంలో జన్మించాడు. ఈయన మద్దమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కొడుకులు. అందులో ఇద్దరు శాసనసభ్యులు అయ్యారు. కె.ఈ.కృష్ణమూర్తి ఢోన్ నియోజకవర్గం నుండి, కె.ఈ.ప్రభాకర్ పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. కె.ఈ.కృష్ణమూర్తి తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. ఈయన 1994, మే 5 న మరణించాడు.

రాజకీయ జీవితం
మాదన్న, 1938లో జిల్లా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇది స్వాతంత్రం తర్వాత జిల్లాపరిషత్ అధ్యక్షుడి హోదాకు సమానమైన పదవి. తన లక్ష్యాలను సాధించేందుకు ఢోన్ నుండి కర్నూలుకు మారాడు. కర్నూలు నుండి సమాజంలో బలహీనవర్గాల ప్రజలకు సహాయంచేస్తూ వచ్చాడు. దీని వళ్ళ అగ్రకులాల నాయకులు, ఫ్యాక్షనిస్టులతో శతృత్వం ఏర్పడింది. మాదన్న బలహీనవర్గాలకు నేరుగా చేరుకుని సహాయపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు నచ్చని అగ్రకులాల వ్యక్తులు, ఈయన సహచరులని చంపి, ఈయన్ను బెదిరించే స్థాయికి చేరాయి.

స్వాతంత్రం తర్వాత మాదన్న 1967లో కర్నూలు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి, శాసనసభకు ఎన్నికయ్యాడు. 1972లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికయ్యాడు. 1978లో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పేవరకు కర్నూలు జిల్లా కాంగ్రేసు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.

షెడ్యూల్డ్ కులాల నుండి తొలి ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్యకు మాదన్న మద్దతు నిచ్చాడు. పెండేకంటి వెంకటసుబ్బయ్య, నర్సప్ప మరియు బి.వి.సుబ్బారెడ్డి లతో పాటు సంజీవయ్య ఈయనకు సన్నిహిత రాజకీయసహచరుడు మరియు స్నేహితుడు.

not found