not found

నిబద్ధతకు నిరుపమాన నిదర్శనం

ప్రజావైద్యశాల స్థాపించేం దుకు 1971 ఆరంభంలో సూర్యాపేటకు వెళ్లాను.  కీ.శే. వి. బుచ్చిరాములు నాడు సూర్యాపేట డివిజన్‌ సీపీఎం కార్యదర్శిగా ఉండేవారు. ఆ హాస్పిటల్‌ స్థాపనలో నాకు స్థానికంగా ఉండి సహకరించిన ఇద్దరిలో ఆయన ఒకరు. ఆ పరి చయం నేను సీపీఎంని వీడి వచ్చేవరకు (1991) కొనసాగింది. ఆ పిదప సీపీఎం(బీఎన్‌) పార్టీ ఏర్పడి నప్పటినుంచి తిరిగి సన్నిహితంగా కొనసాగింది. తర్వాత ఆయన కన్నుమూసేవరకు అరుదుగానైనా కలిసేవారు. ఈ సందర్బంగా సీపీఎం (బీఎన్‌) పార్టీ గురించి కొంత చెప్పాలి. ఆనాటివరకు సూర్యాపేట డివిజన్‌లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరపున బీఎన్, స్వరాజ్యం, వీఎన్‌లే పోటీచేసేవారు. వీరందరిదీ ఒకే కుటుంబం. కానీ 1993 ఎన్నికల కమిటీ ఇన్‌చార్జిగా డివిజన్‌ కార్యదర్శి బుచ్చిరాములు పేరు ప్రకటించింది పార్టీ.

కానీ ఫైనల్‌గా పోటీచేసే అభ్యర్థిగా మల్లుస్వరాజ్యం పేరు ముందుకొచ్చింది. అప్పటికే సీపీఎం పార్టీలో అక్కడక్కడా ‘‘ఎప్పుడూ ఆ కుటుంబమేనా, ఈ రెడ్లోళ్లేనా’’ అనే గుసగుసలు వినిపించేవి. సాధారణ కార్యకర్తల్లో బుచ్చిరాములు నెమ్మదితరహా, నిజాయితీ పట్ల అభిమానం ఉండేది. జిల్లాపార్టీలో వివిధస్థాయిల్లో యువకులు అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు బుచ్చిరాములే ఈ సారి పార్టీ అభ్యర్థిగా నిలబడాలని పట్టుపట్టారు. దాంతో రాష్ట్ర కమిటీ కూడా దిగివచ్చి తమ నిర్ణయాన్ని మార్చుకుని బుచ్చిరాములు అభ్యర్థిత్వాన్నే బలపర్చక తప్పలేదు. పార్టీ తరఫున మోటూరు హనుమంతరావు పార్టీ జనరల్‌ బాడీలో ‘‘ఇన్నేళ్ల చరి త్రలో స్థానిక నాయకత్వం ‘మొండి’ వైఖరి కారణంగా ఈ ప్రకటన చేయక తప్పలేదు. ఇక గెలిపించుకునే బాధ్యత వారిదే’’ అన్నారు.

తీరా ఎన్నికల్లో ఆయన వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. సహజం గానే ఆ ఓటమికి కారణం పార్టీలో ఒక వర్గం, ఆధిపత్య కులాల కుట్ర వల్లేనని ప్రచారమైంది. తన ఓటమి పట్ల బుచ్చిరాములు కిమ్మనలేదు కానీ సమర్థించినవారితో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వీరంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం వేరే పార్టీ పెట్టారు. సీనియర్‌ అయిన బీఎన్‌ కూడా ఈ యువకుల తరఫున నిలబడటంతో సీపీఎం(బీఎన్‌) పార్టీ ఏర్పడింది. అణగారిన కులాల తరఫున పోరాడకుండా సీపీఎం తన లక్ష్యాన్ని సాధించలేదు అనే మౌలిక అవగాహన ఈ కొత్త పార్టీకి ఉండేది. ఈ అవగాహతోటే నేనూ ఈ కొత్త పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యాను.

సీపీఎం(బీఎన్‌) నేతృత్వంలో కీ.శే దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా సూర్యాపేటలో సామాజిక న్యాయం కోసం పెద్ద బహిరంగ సభ జరిగింది. బుచ్చిరాములుతోసహా అందరూ ఆ సభ జయప్రదం కావడానికి విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సీపీఎం(బీఎన్‌)ని రద్దుచేశారు. బీఎన్‌తోపాటు కొందరు ఎంసీపీఐలో చేరగా కొందరు టీడీపీలో, బుచ్చిరాములుతోపాటు మరి కొందరు తిరిగి సీపీఎంలో చేరారు. ఆనాటికే సామాజికన్యాయం కోసం పోరాడాలనే లక్ష్యం సీపీఎంలో కొందరిలో ఉండేది. ఈ మధ్య బుచ్చిరాములుతో మాట్లాడిన సందర్భంగా, సీపీఎం ప్రస్తుతం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తోం దనీ, తెలంగాణలో సీపీఎం ఆ మార్గంలో మరింత శాస్త్రీయ అవగాహనతో సాగుతోందని అనుకున్నాం.

బుచ్చిరాములు ‘రాళ్లెత్తిన కూలీ లెవ్వరు’ అనే పుస్తకం రాశారు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్య మం కోసం తొలినాళ్లలో కృషి చేసిన వారి గురించి సంక్షిప్తంగా వివరించారు. గ్రామస్థాయిలో ఎంతమంది మహిళలు, పురుషులు ఎంత అంకిత భావంతో పనిచేశారో ఆ పుస్తకంలో పొందుపర్చారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు భరించి నిలబడిన నాటి పునాదిరాళ్లను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆ పుస్తకాన్ని ఈ తరానికి తెలియని ‘తమకు తెలియని చరిత్ర’గా భావిస్తాను.అలాంటి చరిత్ర రచనకు అనుభవం, అర్హత ఉన్న వాళ్లు తప్పక ప్రయత్నించాలి. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా నాటి సూర్యాపేట డివిజన్‌లో ఎర్రజెండా ఔన్నత్యానికి కృషి చేసిన తాను కూడా ఒక ప్రధానమైన పునాది రాయి అని బుచ్చిరాములు నిరూపించుకున్నారు. ఆయన ధన్యజీవి.

వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు

Amenties

  • Freedom Fighters
not found