రాజా నర్సాగౌడ్
రాజా నర్సాగౌడ్ కుడి నుండి ఐదవ వ్యక్తి
రాజా నర్సాగౌడ్ (1866-1948) అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి.
జీవిత విశేషాలు
సంపన్నుడైన నర్సాగౌడ్ 1866లో నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. వారి తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో ఇతడు చివరివాడు. ఇతని అన్నలు రామాగౌడ్, లక్ష్మాగౌడ్ తమ కుటుంబ వ్యాపారమైన ఎక్సైజ్ వ్యాపారం నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూవుంటే ఇతడు నిజామాబాదులో వుంటూ వ్యాపార లావాదేవీలు చూసుకునేవాడు. ఈ ముగ్గురు సోదరులూ తమ వ్యాపారాన్ని విస్తరించి హైదరాబాద్ స్టేట్‌లో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకరుగా ఎదిగారు. ఇతని మనుమరాలు బొమ్మ హేమాదేవి నవలా రచయిత్రిగా ప్రసిద్ధురాలు. మరొక మనుమరాలు ఆర్.అఖిలేశ్వరి తొలితరపు మహిళా జర్నలిస్టుగా ప్రసిద్ధి పొందింది
సేవాకార్యక్రమాలు
ఇతడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సమాజసేవ చేయడంలోకూడా ఆసక్తిని కనబరచాడు. ఇతడు దానధర్మాలు చేసినప్పుడు కులమతాల వివక్షతను పాటించలేదు. ఇతడు గుళ్లు, మసీదులు, దర్గాల నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసహాయం చేశాడు. ఇతడు నిజామాబాదులోని కొత్తగల్లీలోను, కంఠేశ్వర్‌లోను బీదవారికి,బ్రాహ్మణులకు ధర్మసత్రాలను కట్టించాడు. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, పలు అధ్యాత్మిక క్షేత్రాలను నిర్మాణం, పునరుద్ధరణకు కృషి చేశాడు[2]. జిల్లాకేంద్రమైన నిజామాబాదులో మొదటి నీటిట్యాంకు నిర్మాణం, నల్లాలు బిగించుటకు సిర్నపల్లి సంస్థాధీశురాలు ఛీలం జానకీబాయి సహకారంతో ఆర్థిక సహాకారం అందచేశాడు. నిజాం పాలనలో సిల్లర్‌జుబ్లీ ఉత్సవాల సమయంలో టౌనుహాల్‌ను నిర్మింపజేశాడు. ఇంకా శంభునిగుడి, నీలకంఠేశ్వరాలయం, సిఎస్‌ఐ చర్చి, మసీదుల నిర్మాణం, పునరుద్ధరణకు సహాకారం అందించాడు. డిచ్‌పల్లిలో 30 ఎకరాల భూమిని క్రిస్టియన్ మిషనరీలకు కుష్టునివారణ కేంద్రం స్థాపించడానికి దానం చేశాడు. ఇన్‌స్టిట్యూషనల్ కేర్ గివింగ్ హాస్పెటల్‌గా ప్రారంభమైన ఈ ఆసుపత్రి భారతదేశంలోనే మొట్టమొదటిది[3]. 1937లో నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభల సందర్భంగా వేలాదిమందికి భోజన ఏర్పాట్లు చేశాడు. నిజామాబాద్ నుండి మంచిర్యాలకు మధ్య ఉన్న రహదారిలో ప్రతి కొన్ని మైళ్లకు ఒక బావి చొప్పున తవ్వించి ప్రయాణీకుల దాహాన్ని తీర్చాడు. ఇల్లు లేని పేదవారికి కంఠేశ్వర్, విమ్రి గ్రామాలలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. ప్రతియేటా బీదవారికి చలికాలం ప్రారంభమైయ్యే సమయానికి గొంగళ్లు, చెప్పులు పంచేవాడు. వేసవి కాలంలో బీదవారికి అంబలి ఇచ్చేవాడు. ఇతడు నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి (జజ్గిఖానా) ఏర్పాటు చేయడానికి కారకుడైనాడు. ఇతనికి విద్యపట్ల నమ్మకం ఉండేది. ఇతడు అనేక మంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడ్డాడు. ఇతని తోడ్పాటుతో చదువుకున్న అనేకులు ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జీలు, లోక్‌సభ సభ్యునిగా కూడా ఎదిగారు. వీరిలో అన్ని కులాలకు సంబంధించిన వారున్నారు. ఇతని సహాయంతో చదివి ఇంజనీర్ అయిన నారాయణ గౌడ్ అనే వ్యక్తికి తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేశాడు. నిజామాబాదులో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటుకు ఇతడే కారకుడు. ఇతడు నివాసం ఉన్న ప్రాంతాన్ని నర్సాగౌడ్ కాలనిగా పిలుస్తున్నారు.
సన్మానాలు, బిరుదులు, గుర్తింపులు
ఇతడు ఎన్ని దానధర్మాలు చేసినా ఇతనికి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఒకసారి ఇతని ఏకైక కుమారుడు రామాగౌడ్ ఇతనికి తెలియకుండా ప్రసూతి ఆసుపత్రిలో దానిని నిర్మించింది నర్సాగౌడ్ అని తెలిపే ఒక శిలాఫలకాన్ని ప్రతిష్టించాడు. నర్సాగౌడ్ ఈ విషయం తెలిసిన వెంటనే దానిని తొలగించి వేశాడు. ఇతడు అతి కష్టంమీద ఏడవ నిజాం ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రదానం చేసిన “రాజా” అనే బిరుదును అంగీకరించాడు. 1930లో ఐదవ కింగ్ జార్జ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతడు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా ఒక పతకాన్ని బహూకరించి సత్కరించాడు.
మరణం
ఇతడు 1948, ఏప్రిల్ 4వ తేదీన తన 82వ యేట మరణించాడు. ఆ సమయంలో హైదరాబాదు స్టేట్‌లో రజాకార్ల ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. హిందూ ముస్లీముల మధ్య విద్వేషాలు, భయాందోళనలు పెచ్చిల్లుతున్న కాలమది. నర్సాగౌడ్ పార్థివదేహాన్ని స్మశానానికి తీసుకు వెళ్లడానికి సంశయిస్తున్నారు. కారణం స్మశానానికి వెళ్లడానికి ముస్లీముల ఇళ్ళను దాటి వెళ్ళాలి. అదొకటే మార్గం ఉంది. ఆ దారిలో వెళితే ఏమి ప్రమాదమో అని భయపడ్డారు. కాని గత్యంతరం లేక అదే దారిలో వెళ్ళాల్సి వచ్చింది. అయితే వారు భయపడినట్లు కాక దారిలో ముస్లీములు నర్సాగౌడ్ శవానికి ఎదురువెళ్లి వారు కూడా ఆ శవాన్ని స్మశానం వరకూ మోసుకువెళ్లారు. నర్సాగౌడ్‌పై ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా అభిమాన గౌరవాలు ఉన్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
Congratulation!